పేదలే కాదు కార్పోరేట్ సంస్థలు సైతం భూ ఆక్రమలకు పాల్పడ్డటు తాజాగా బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు బెంగళూరులోని గార్డెన్ సిటీ పూర్తిగా నీటి మునిగింది. ఈ దుస్థితికి అక్రమ నిర్మాణాలే కారణమని నిర్ధారణకు వచ్చిన కర్ణాటక ప్రభుత్వం బుల్డోజర్లను రంగంలోకి దింపింది. చెరువులు, రాజకాలువ మురుగు కాలువలపై నిర్మించిన కట్టడాలను నోయిడా ట్విన్ టవర్స్ తరహాలో కూల్చివేస్తామని కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ ప్రకటించారు. బెంగళూరులో 30 ఐటీ పార్కులను అక్రమంగా నిర్మించినట్లు చెప్పిన ఆయన.. తప్పుచేసింది ఎంతటివారైనా ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే మురుగు కాలువలపై అక్రమ నిర్మాణాల జాబితాను బెంగళూరు నగరపాలికె (బీబీఎంపీ) రూపొందించిందని తెలిపారు.
వీటిల్లో విప్రో, ఇకోస్పేస్, ప్రస్టేజ్, బాగమనే టెక్ పార్క్ వంటి ఐటీ దిగ్గజాలు.. కొలంబియా ఆసియా హాస్పిటల్, దివ్యశ్రీ విల్లాస్ వంటివి ఉండటం గమనార్హం. మొత్తం 950 కట్టడాలు కాలువల బఫర్ జోన్‌లో ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. వచ్చే వర్షాకాలం లోగా అడ్డగోలు నిర్మాణాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆదేశించారు. చెరువులు, రాజకాలువ, డ్రైనేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.300 కోట్లను కేటాయించింది.
తూర్పు బెంగళూరులోని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతకు చెందిన నల్పాద్ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ స్కూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ నల్పాద్‌కు సంబంధించింది. వరదల విషయంలో కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో ఆయన ముందున్నారు.
రాజ కాలువలు, చెరువుల కబ్జాకు సంబంధించి వాస్తవ స్థితిగతుల నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం, బీబీఎంపీ సహా పలు సంస్థలకు కర్ణాటక హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మూడేళ్ల కిందట ఇచ్చిన ఆదేశాలను ఇప్పటి వరకు ప్రభుత్వం, పాలికె పట్టించుకోలేదని న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకాలువ, చెరువుల బఫర్ జోన్ కబ్జాలను పూర్తి స్థాయిలో తొలగించకపోవడంతోనే ఔటర్ రింగ్ రోడ్డు, మహదేవపుర, బెళ్లందూరు, సర్జాపుర రోడ్డు ప్రాంతాల్లో వర్షం కురిసిన ప్రతిసారీ సమస్య ఎదురవుతోందని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధె నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa