రక్తదానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు 17న రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. సూర్యకుమారి వెల్లడించారు. జిల్లాలోని ఆసుపత్రులు, రక్తనిధి కేంద్రాలు, రక్తనిల్వ కేంద్రాలు వున్న చోట్ల ఆరోజున రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నామని, రక్తదాతలు, యువత ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని రక్తం కొరత లేకుండా చూసేందుకు సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఆరోజున 9 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఈ శిబిరాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. అక్టోబరు 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంగా నిర్వహిస్తున్నారని ఆరోజు వరకు ఈ శిబిరాలు జరుగుతాయన్నారు. రక్తదానంపై వున్న అపోహలను తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేసేందుకు అవకాశం వున్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.