ఏ వైద్య సేవల అయినా పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఏపీలోనే సగౌరవంగా, సకల సదుపాయాలతో అందరూ పొందాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని మంత్రి విడదల రజని తెలియజేసారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ... విభజన అనంతరం ఏపీలో సూపర్ స్పెషాలిటీ సేవలు అవసరమయ్యాయి. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి చౌకగా, అత్యాధునిక పరికరాలతో వైద్యసేవలు, మెరుగైన సౌకర్యాలతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. 16 మెడికల్ కాలేజీలను ఇప్పటికే చేపట్టాం. పార్వతీపురంలో మరో కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం.
కోవిడ్ కారణంగా ఎదురైన అనేక సవాళ్లను ఎదురించి అత్యధికంగా, అత్యంత వేగంగా కాలేజీల పనులు చేపడుతున్నాం. ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపడుతున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు వైద్యాన్ని మరింత చేరువ చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ ఉద్దేశం. నాడు–నేడు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం. గతంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కొత్తగా 17 కాలేజీలు నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదు. గత ఐదేళ్లు దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేసింది. ప్రజలంతా ఆనందంగా సంతోషంగా ఉండాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమన్నారు.