దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కలకలంరేపుతోంది. ఈ స్కాంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ రోజు ఐదు రాష్ట్రాల్లోని 40 లొకేషన్లలో ఒకేసారి సోదాలను నిర్వహిస్తోంది. ఈ కేసులో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల పేర్లు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కేవలం హైదరాబాదులోనే 20 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని నెల్లూరుతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ (నేషనల్ క్యాపిటల్ రీజన్)లో కూడా సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ బిజినెస్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్ వర్క్ లే లక్ష్యంగా రెయిడ్స్ కొనసాగుతున్నాయి.
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఈడీ రెయిడ్లు చేస్తుండటం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత వారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో సోదాలను నిర్వహించింది. అప్పుడు ఏపీలో సోదాలు నిర్వహించని ఈడీ... ఇప్పుడు నెల్లూరులో సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును సీబీఐ కూడా విచారిస్తుండటం తెలిసిందే.