ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంసార జీవితంలో ఆనందం కోసం..ఏకంగా 53 పెళ్లిళ్లు చేసుకొన్నాడు

international |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 11:32 PM

ఒక పెళ్లితో జీవితం ఏగలేకపోతున్నాం అని చెప్పేవారికి సౌదీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆదర్శంగా నిలిచాడు. భాగస్వామితో పొసగకపోతే కొంత మంది విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకుంటారు. అలా మూడు పెళ్లిళ్లు, నాలుగు పెళ్లిళ్లు కూడా చేసుకునే వాళ్లుంటారు. కానీ, సౌదీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 53 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ‘నేను ఇంత మంది మహిళలను పెళ్లి చేసుకున్నది సుఖం కోసం కాదు. సంసార జీవితంలో ఆనందం, స్థిరత్వం వెతుక్కునే క్రమంలో ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది’ అని అతడు చెబుతున్నాడు. 20 ఏళ్లకే తొలి పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి పేరు అబూ అబ్దుల్లా. ప్రస్తుతం ఆయన వయస్సు 63 ఏళ్లు. గత 43 ఏళ్లలో అబ్దుల్లా పెళ్లి చేసుకున్న 53 మంది మహిళలల్లో 52 మంది సౌదీకి చెందినవారే. ఒక్కరు మాత్రం విదేశీ మహిళ. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాల్లో కొన్నిసార్లు రెండు, మూడు నెలలపాటు బస చేయాల్సి వచ్చేదని.. ఈ క్రమంలో అక్కడ తన బాగోగులు చూసుకునేందుకు ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నానని అబ్దుల్లా తెలిపాడు.


సౌదీకి చెందిన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దుల్లా తన పెళ్లిళ్ల గురించి చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆయన ‘ఈ శతాబ్దపు అత్యధిక భార్యలు (బహుభార్యత్వం) కలిగిన వ్యక్తి’గా మారుపేరు పొందాడు.


ఈ 53 భార్యల్లో అత్యల్పంగా ఒక భార్యతో ఒక్క రాత్రి మాత్రమే అబ్దుల్లా బంధం కొనసాగింది. ‘నాకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తొలిసారి వివాహమైంది. ఆమె నాకంటే ఆరేళ్లు పెద్దది. అయినా, నాకు ఆమెతో విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మొదట్లో లేదు. మొదటి వివాహం తర్వాత నేను సుఖంగా ఉన్నాను. పిల్లలు కూడా కలిగారు. అయితే, మూడేళ్ల తర్వాత మా బంధంలో సమస్యలు వచ్చాయి. 23 ఏళ్ల వయస్సులో మళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయాన్ని నా మొదటి భార్యకు తెలిపాను’ అని అబ్దుల్లా చెప్పుకొచ్చాడు.


ఇక రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య, రెండో భార్య తరచూ గొడవ పడేవారట. వాళ్లతో విసిగిపోయి మూడో పెళ్లి, అదే కారణంతో నాలుగో పెళ్లి చేసుకున్నట్లు అబ్దుల్లా తెలిపాడు. ఆ తర్వాత తన మొదటి ఇద్దరు భార్యలకూ విడాకులు ఇచ్చేశాడట. ‘నేను ఇన్ని వివాహాలు చేసుకోవడానికి సాధారణ కారణం.. నన్ను సంతోషపెట్టగల స్త్రీ కోసం వెతకడమే. నేను నా భార్యలందరికీ న్యాయం చేయడానికే ప్రయత్నించా’ అని అబ్దుల్లా చెప్పాడు. ‘విదేశీ వ్యాపార పర్యటనల సమయంలో ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నాను. నేను మూడు, నాలుగు నెలలపాటు విదేశాల్లో ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇతర స్త్రీల పట్ల వ్యామోహం నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు ఆ వివాహం చేసుకోవాల్సి వచ్చింది’ అని అబ్దుల్లా అన్నాడు. ‘ప్రపంచంలో ప్రతి పురుషుడు ఒక్క మహిళతో మాత్రమే కలకాలం ఉండాలని కోరుకుంటాడు. అయితే, నా అనుభవం ప్రకారం స్థిరత్వం అనేది యువతితో సాధ్యంకాదు. అది వయసు పైబడిన మహిళలతోనే సాధ్యం’ అని అబ్దుల్లా చెప్పుకొచ్చాడు. అబ్దుల్లా ఇటీవలే 53వ పెళ్లి చేసుకున్నాడు. ఇక తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదని చెబుతున్నాడు. ఈ నాటీ ఓల్డ్ మ్యాన్ మాటలు నమ్మొచ్చాంటారా? కొన్ని గంటలు వేచి చూడాల్సిందే..!


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com