నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుత పులులు మన అతిథులని, కునో-పాల్పుర్ నేషనల్ పార్క్ వాటి ఇల్లు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వీటిని తీసుకురావడం కోసం ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తోందని, దీని వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య అమృతోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో వీటిని తీసుకొచ్చామని, నూతన శక్తితో వీటిని పరిరక్షిస్తామని చెప్పారు. మన దేశంలో గతంలో ఆసియాటిక్ చిరుత పులులు ఉండేవి. అయితే ఇవి అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఈ జాతిని పునరుద్ధరించడం కోసం నమీబియా నుంచి ఎనిమిది చిరుత పులులను తీసుకొచ్చారు. వీటిని నరేంద్ర మోదీ శనివారం మధ్య ప్రదేశ్‌లోని కునో-పాల్పుర్ నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టారు.