వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇతర రాష్ట్రాల్లో విచారించేలా చూడాలని ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ వారి స్పందనను చూసిన తర్వాత సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. తదుపరి విచారణ వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేశారు. ఏపీ ప్రభుత్వం సీబీఐకి అడ్డంకులు సృష్టిస్తోందని.. కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని సునీత ఆగస్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి హత్య కేసును ఏపీ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా.. కేసు విచారణ ముందుకు సాగేలా కనిపించడం లేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై నిందితులుగా ఉన్న వారు కేసులు పెడుతున్నారని తెలిపారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, సీబీఐ, ఏపీ డీజీపీలను చేర్చారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలోని సొంత నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. మూడేళ్లు గడిచినప్పటికీ అసలు హంతకులు ఎవరనేది ఇంత వరకు నిర్ధారణ కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సునీత..సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. వివేకా హత్య జరిగిన వెంటనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హత్యకేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను నియమించింది. ఏడాది వ్యవధిలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటైనా హంతకులను పట్టుకోలేకపోయాయి.