‘ది గార్డియన్’ పత్రిక రష్యా తీరుపై సంచలన కథన ప్రచురించింది. ఉక్రెయిన్ పై రష్యా సుదీర్ఘంగా యుద్ధం కొనసాగిస్తోంది. ఇరు వైపులా చాలా ప్రాణ నష్టం జరిగినా రష్యా వెనక్కు తగ్గడం లేదు. మరోవైపు ఐరోపా దేశాల మద్దతుతో ఉక్రెయిన్ సైతం దీటుగా బదులిస్తోంది. రష్యా బలగాల అధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటోంది. దీంతో, ఒత్తిడికి గురవుతున్న రష్యా.. యుద్ధ భూమిలో సైనికుల కొరతతో సైతం ఇబ్బంది పడుతోంది. సైనిక కొరతను తీర్చుకునేందుకు రష్యా ఖైదీలను తమ సైన్యంలో చేర్చుకుంటోందని ‘ది గార్డియన్’ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. ఆరు నెలలు యుద్ధభూమిలో పని చేస్తే శాశ్వతంగా జైలు నుంచి విముక్తి చేస్తామన్న వాగ్దానంతో దొంగలు, హంతకులను రిక్రూట్ చేసుకుంటోందని పేర్కొంది.
ఇదే విషయాన్ని వ్లాదిమిర్ పుతిన్ సన్నిహిత మిత్రుడు, వాగ్నర్ గ్రూప్ అధిపతి యవ్జెనీ ప్రిగోజిన్ తన బృందానికి చెబుతున్నట్టుగా ఉన్న ఓ వీడియో రష్యా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వార్తలను ప్రిగోజిన్ ఖండించారు. కానీ, ఖైదీలను సైన్యంలో చేర్చుకుంటున్న విషయాన్ని పలువురు ధ్రువీకరిస్తున్నారు. ‘ఆరు నెలలు పోరాడితే మేం జీవితాంతం స్వేచ్ఛగా ఉంటాం అని ప్రిగోజిన్ మాకు హామీ ఇచ్చారు. కానీ కొద్దిమంది మాత్రం తిరిగి జైలుకు వస్తారని ఆయన హెచ్చరించారు’ అని మాస్కోకు దక్షిణంగా 300 మైళ్ల దూరంలోని ఓ జైలులో ఖైదీగా ఉన్న ఇవాన్ అనే వ్యక్తి ‘ది గార్డియన్’తో చెప్పాడు.
ఈ ప్రతిపాదనకు సుమారు 120 మంది ఖైదీలు అంగీకరించారని, వాళ్లంతా ఒకవారం శిక్షణ తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్‌లో పోరాడుతున్నారని తెలిపాడు. ‘ఈ ఆఫర్ ను నేను తిరస్కరించా, కానీ, ప్రిగోజిన్ మళ్లీ సంప్రదిస్తే నేను కూడా ఆర్మీలో చేరుతా. ఎందుకంటే నేను ఇంకా 11 సంవత్సరాలు జైలులో గడపాలి. ఈ లోపే నేను చనిపోయేలా ఉన్నాను. నేను ఇక్కడ చనిపోయినా అక్కడ (ఉక్రెయిన్) చనిపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. కనీసం కనీసం నా స్వాతంత్ర్యం కోసం పోరాడే అవకాశం నాకు లభిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.