చండీగఢ్ యూనివర్శిటీ అమ్మాయిల వీడియో లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వీడియో లీక్ కేసులో మరో కొత్త విషయం వెల్లడైంది. ఈ కేసులో అరెస్టయిన విద్యార్థిని తమను చిత్రీకరిస్తుండగా తోటి విద్యార్థులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆమెతో మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలు తీస్తుండగా పట్టుకున్న ఆరుగురు మహిళలు.. ఎందుకు వీడియోలు తీశావని ఆమెను అడిగారు. ఇలా చేయాలని తనపై ఓ వ్యక్తి ఒత్తిడి తెచ్చాడని అందుకే తీశానని, తర్వాత వాటిని తొలగించినట్లు నిందితురాలు వాళ్లకు చెప్పడం కనిపించింది. సిమ్లాకు చెందిన సన్నీ మెహతా ఒత్తిడితోనే తాను ఈ వీడియోలను రూపొందించానని ఆమె తెలిపింది. అతను ఎవరో తనకు తెలియదని చెప్పింది. కానీ, ఆ అమ్మాయిలు గట్టిగా అడగడంతో సిమ్లాలోని రోహ్రులో బేకరీ నిర్వహిస్తున్న సన్నీ మెహతా ఫొటోను వాళ్లకు చూపించింది.
‘ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేస్తే, మాకు చెప్పండి, మేము అతనిపై చర్యలు తీసుకుంటాము’ అని అమ్మాయిలు వీడియోలో నిందితురాలైన విద్యార్థిని అడిగారు. అనంతరం ఆ ఆరుగురు మహిళలు మొదట హాస్టల్ వార్డెన్ రాజ్‌విందర్ కౌర్‌కు ఈ విషయం చెప్పారు. అయితే, విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఆరోపణలపై రాజ్ విందర్ కౌర్ తర్వాత సస్పెండ్ అయ్యారు.
తర్వాత విషయాన్ని హాస్టల్ మేనేజర్ రీతూ రనౌత్ దృష్టికి తీసుకెళ్లారు. వీడియోలు తీసినట్టు ఒప్పుకున్న నిందితురాలిని రీతూ ప్రశ్నించింది. హాస్టల్ మేనేజర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితురాలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఆమె స్నేహితులైన ఇద్దరు పురుషులను కూడా అరెస్టు చేసి వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.