ఇప్పుడంటే.. నాన్‌స్టిక్‌లూ కుక్కర్లూ వచ్చాయి కానీ, ఆ రోజుల్లో తెలంగాణ లోగిళ్ళలో కట్టెల పొయ్యిమీద మట్టి కంచుట్లో చేపల పులుసు ఉడుకుతుంటే.. ఆ ఘుమఘుమలు వాడవాడంతా వ్యాపించేవి. ఉడుకుతున్న పులుసులో.. తేలుతున్న ముక్కలను చూస్తూ నోరూరి లొట్టలేయడం సరేసరి. కంచంలో కమ్మటి చేపల పులుసుందంటే మటన్, చికెన్.. ఏదైనా బలాదూర్. వివిధ ప్రాంతాల్లో రకరకాల పద్ధతుల్లో చేసే చేపల పులుసు.. ఆ ప్రాంతం పేరుతోనే ఫేమస్ అవుతుంది.
మరి, మనతెలంగాణ చేపల పులుసు సంగతులేంటో చూద్దాం..ఏ వంటైనా వేడివేడిగా తింటే రుచి. కానీ, చేపల పులుసు మాత్రం ఓ పూట ఊరితేనే రుచి రెట్టింపవుతుంది. చింత పులుసులో చేప ముక్కలు బాగా నానిపోయి, వాటిలోని సారం పులుసులోకి దిగితేనే కూర రుచి పెరుగుతుంది. ఏదేమైనా అంతసేపు ఎదురుచూశాం కదా.. అని ఆగమాగం తినడానికుండదు. ఓపిగ్గా ముళ్ళు ఒలుచుకుంటూ ఆరగించాల్సిందే.
* బొమ్మెలు(కొర్రమీను), రావులు, బొచ్చెలు, వాలుగు.. తెలంగాణలో ఎక్కువగా దొరికే చేపలు. వీటిలో ఎక్కువగా బొమ్మెల పులుసు ఫేమస్. ముళ్ళు తక్కువగా ఉండే వీటిధర మటన్‌తో సమానం. అయినా, వీటిని తినేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతారు. తెలంగాణ గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో దొరికే ఈ చేపల రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ సముద్ర చేపలు తినేవాళ్ళు, తెలంగాణ చేపల పులుసంటే చెవి కోసుకుంటారు.
* మటన్, చికెన్‌లను ఏ యూట్యూబ్ చానల్‌లో చూస్తూనో అటు ఇటుగా వండేయొచ్చు. కానీ, చేపల పులుసు వండాలంటే మాత్రం పెద్దల సలహా, సహకారం తప్పనిసరి. ఎందుకంటే చింతపండు, ఉప్పు, కారం కొలతల్లో ఏమాత్రం తేడా వచ్చినా పులుసు సంగతంతేమరి.
* కొన్ని ప్రాంతాల్లో ముందుగా ఉప్పు, కారంతోసహా అన్నీవేసి పులుసు మరిగిస్తారు. ఆ తర్వాత తెర్లుతున్న పులుసులో చేపముక్కల్ని వేసి, కాసేపాగి దించుతారు. కొందరుమాత్రం ముక్కల్ని నూనెలో కాస్త వేయించిన తర్వాత పులుసువేసి మరిగిస్తారు. ఎలా వేసినా ఉప్పు, కారం సరిగ్గా పడితేనే చేపల నీసు వాసనపోయి కమ్మని ఘుమఘుమలొచ్చేది.
* మాంసాహారులు కనీసం వారంలో రెండు సార్లు చేపలను తింటే మంచిది. దీనివల్ల రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్స్ 30 శాతం వరకూ తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు ఉండదు. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కాబట్టి, గుండె సమస్యలున్నవారు తరచూ చేపలను తీసుకుంటే మంచిది.
* చేపల్లో విటమిన్ డి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. సూర్యకాంతి రూపంలో మనకు లభించే విటమిన్ డికి సమానమైన పోషకాలు చేపల ద్వారా లభిస్తాయి. దీంతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. తరచూ చేపలను తింటే వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు.
* చేపలను రెగ్యులర్‌గా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం మరే ఆలోచనా పెట్టుకోకుండా వారానికి రెండుసార్లు చేపల పులుసు వండుకోండి. లొట్టలేస్తూ తినేయండి మరి.