ఆముదాలవలస నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక మైన విద్యాసంస్థలను మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వైసిపి సర్కార్ కు దక్కుతుందని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొందూరు మండలం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు అయ్యాయన్నారు. సరుబుజ్జిలి మండలం లో వైయస్సార్ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు జరిగిందన్నారు. ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు, ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు జరిగాయన్నారు. వీటిలో గత ఏడాది నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొనసాగుతుందన్నారు.
బూర్జ మండలం పెద్ద పేట గ్రామంలో హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మంజూరైనట్లు వెల్లడించారు. వీటికి ఆర్ధికపరమైన ఆమోదంతో పాటు, పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ ఏడాది నుండి ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు జరుగనున్నట్లు తెలిపారు. హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఈ ఏడాది నుండే విద్యార్థులకు, రైతులకు అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను గురువారం ప్రారంభించేందు కు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియ విజయ, డిసిసిబి చైర్మన్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, వైసీపీ ప్రముఖులు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానున్నారని తెలిపారు. పెద్ద పేట గ్రామంలో ఉదయం 10 గంటలకు హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ప్రారంభం కానుందని తెలిపారు. మధ్యాహ్నం కృషి విజ్ఞాన కేంద్రం వద్ద హాస్టల్ ను వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించ నున్నారని తెలిపారు. సాయంత్రం మూడు గంటలకు తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆముదాలవలస నియోజకవర్గ ప్రజానీకం తరలిరావాలని స్పీకర్ పిలుపునిచ్చారు. గత ఏడాది పొందూరు లో ప్రారంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు , తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు , వెన్నెలవలస లో గల వైయస్సార్ పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలతో పాటు, నూతనంగా ప్రారంభంకానున్న హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలకు శాశ్వత వసతి దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. భవనాలు నిర్మాణాలుకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసినట్లు స్పీకర్ వెల్లడించారు. వీటికి సంబంధించిన పాలనాపరమైన అనుమతులు మంజూరు అయిన వెంటనే, యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణం చేపడతామని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి ఎంపీపీ కే వి జి సత్యనారాయణ పాల్గొన్నారు.