చైనా దేశాధినేత గురించి ఇటీవల పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ ఏ) అధిపతిగా తొలగించి గృహ నిర్బంధంలో ఉంచారన్న వార్తలు ఒట్టి పుకార్లే అని తేలింది. జిన్ పింగ్ మంగళవారం ఓ అధికారిక కార్యక్రమంలో కనిపించారు. బీజింగ్‌లో ఏర్పాటు చేసిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్ద కాల ఘనతలను వివరించే ప్రదర్శనను ఆయన సందర్శించారు.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం కొత్త విజయం వైపు కృతనిశ్చయంతో ముందుకు సాగడానికి సంఘటితంగా ప్రయత్నించాలని కమ్యూనిస్టులకు పిలుపునిచ్చారు. గత పదేళ్లలో తన నాయకత్వంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ, తమ దేశం సాధించిన విజయాలను హైలైట్ చేశారు. ఈ ప్రసంగాలను చైనా టీవీలు ప్రసారం చేశాయి.
సెప్టెంబరు 16న ఉజ్బెకిస్థాన్ సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ నుంచి తిరిగి వచ్చిన జిన్‌పింగ్ బయట కనిపించడం ఇదే మొదటిసారి. ఆయన వెంట చైనా ద్వితీయ నాయకుడైన లీ కెకియాంగ్, ఇతర అధికారులు ఉన్నారు. దాంతో, జిన్‌పింగ్ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
ఇదిలావుంటే చైనాలో కరోనా ప్రొటోకాల్స్ కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉజ్బెకిస్థాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జిన్‌పింగ్ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఆయనను గృహ నిర్బంధంలో ఉంచి, పీఎల్ ఏ అధిపతిగా తొలగించారన్న పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటిని జిన్‌పింగ్ రాజకీయ వ్యతిరేకులు సృష్టించారని తెలుస్తోంది.