ప్రజల సహకారంతోనే దోమల నివారణ సాధ్యమని వారానికి ఒకసారి డ్రైడే పాటించడం ద్వారా దోమలను నివారించవచ్చని "అమృత్" జాయింట్ డైరెక్టర్ విజయభారతి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 44 వ వార్డు పరిధి అభి నగర్ , షాదీ ఖానా తదితర ప్రాంతాల్లో జీవీఎంసీ జోన్ - 5 కమిషనర్ అర్. జి. వి కృష్ణ తో కలిసి శుక్రవారం ఉదయం డ్రైడే - ఫ్రైడే పై విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ విజయభారతి మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఉంచుకోవాలని తద్వారా దోమలు వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
జీవీఎంసీ జోన్ - 5 కమిషనర్ అర్. జి. వి కృష్ణ మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడికక్కడ మురికి నీరు నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య పనులకు సంబంధించి స్థానిక ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం గా ఉండేందుకు వ్యక్తిగత శుభ్రత తో పాటుగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం డెంగ్యూ దోమల వ్యాప్తి ని అరికట్టేందుకు ప్రజలు జీవీఎంసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. అదేవిధంగా డ్రైడే - ఫ్రైడే పై ప్రజలను సమన్వయపరుస్తూ సచివాలయ సిబ్బంది పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా డ్రైడే - ఫ్రైడే పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ - 5 సహాయక వైద్యాధికారి ఏ. రాజేశ్, మలేరియా సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తో పాటుగా సచివాలయ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.