సోషల్ మీడియా వచ్చాక సీసీకెమెరా రికార్డులు సైతం వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఇదిలావుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా పులి, చిరుత వంటి క్రూర జంతువులు కనిపిస్తే ఏం చేస్తాం? వెంటనే దాని కంట పడకుండా దాక్కునేందుకు ప్రయత్నిస్తాం. వీలైతే పారిపోతాం. అదే జంతువులు మనను చూస్తే.. అమ్మో ఇంకేముంది వచ్చి మీదపడి కొరికేస్తాయి అంటారా. కానీ ఓ మౌంటేన్ లయన్ (పూమా) మాత్రం భిన్నంగా ప్రవర్తించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ రోడ్డు వెంట మహిళ జాగింగ్ చేస్తూ వెళుతోంది. అదే సమయంలో అటువైపు ఓ మౌంటేన్ లయన్ వచ్చింది. జాగింగ్ చేస్తూ వస్తున్న మహిళను చూసి.. పక్కనే ఉన్న ఓ ఇంటి వైపు పరుగెత్తింది. ఆ ఇంటి ముందు పెంచుకుంటున్న మొక్కల వెనకాల వెళ్లి దాక్కుంది. జాగింగ్ చేస్తున్న మహిళకు కనబడకుండా నిలబడి.. ఆమెనే గమనించడం మొదలుపెట్టింది. ఆ మహిళ వెళ్లిపోయాక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా ఆ ఇంటికి ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘అడవి జంతువులు మనుషులకు ఎదురుపడటం, దాడి చేయడానికి దూరంగా ఉంటాయి. వాటికి ఆపద అనిపిస్తేనే దాడి చేస్తాయి. అటుగా వస్తున్న ఓ వ్యక్తికి ఎదురుపడకుండా మౌంటేన్ లయన్ దాక్కున్న వీడియో చూడండి” అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోకు 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందల కొద్దీ రీట్వీట్లు, లైకులు కూడా వస్తున్నాయి. అయితే సుశాంత నందా పెట్టిన క్యాప్షన్ పై చాలా మంది నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.‘‘సాధారణంగా జంతువులు ఏవైనా మనుషులతో పోరాటానికి ఇష్టపడవు. తప్పుకుంటాయి. వాటికి ఏదైనా ప్రమాదం అనిపిస్తేనే దాడి చేస్తాయి..” అని కొందరు సుశాంత నందా వాదనను సమర్థిస్తున్నారు.
‘‘అన్ని జంతువులు వేరు. పిల్లి జాతికి చెందిన చిరుతలు, పులులు, సింహాలు వంటి జంతువులు వేరు. అవి కావాలనే దాక్కుంటాయి. కాస్త అదును చూసి దాడి చేస్తాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి..” అని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం ఆయన పేర్కొనలేదు.