ఎర్రగుంట్ల పురపాలిక పరిధిలో జాతీయ రహదారి పొడవునా ఉన్న డివైడర్ల మధ్య మరికొన్ని ప్రాంతాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించేందుకు పురపాలిక యంత్రాంగం రంగం సిద్దం చేసింది. శనివారం మున్సిపల్ చైర్మన్ మూలె హర్షవర్ధన్రెడ్డి ఈ అంశంపై ఏఈలు సురేష్ బాబు, సందీప్లతో చర్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ. 11. 50లక్షలు ఇందుకోసం వెచ్చించనున్నారు. డివైడర్ల మధ్యలో అలాగే మెయిన్ బజారు ప్రాంతంలో రైల్వే ప్రహారీ వెంబడి మొక్కలను నాటనున్నారు. అలాగే ఈ నిధులు నుండి అవసరమైన చోట్ల రోడ్డు డివైడర్ల ఏర్పాటు కూడా చేయనున్నారు. కాగా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పచ్చదనం వెల్లివిరిసేలా ఎలాంటి చెట్లను నాటితే బాగుంటుందన్న అంశంపై చైర్మన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే మొక్కలకు సంబంధించిన ఫోటో ఆల్బమ్న వారు పరిశీలించారు.