రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుంది.. కాంగ్రెస్‌కు భారత్ జోడో యాత్ర సంజీవని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్..తమిళనాడు, కేరళను దాటి ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర సాగుతుండగా.. రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు.ఈ సందర్భంగా జైరాం రమేశ్ మాట్లాడుతూ ... ఈనెల 18న ఏపీలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రాలయం వరకు నాలుగు రోజుల పాటు 95 కి.మీ మేర ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. అనంతరం తెలంగాణలో 13 రోజుల పాటు యాత్ర జరుగుతుందని ఆయన వివరించారు.
మరో సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ 2024లో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆ బాధ్యత కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు. దేశంలో కుల, మతాల మధ్య భాజపా చిచ్చుపెడుతోందని ఆరోపించారు. విభజించు, పాలించు అనే నినాదంతో ఆ పార్టీ పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు తులసిరెడ్డి, హర్షకుమార్‌తో పాటు జిల్లాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.