గుంటూరు: పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ముద్రబోయిన దుర్గారావు చిన్న కుమార్తె హారిక గుంటూరు మహిళా కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. గత ఆరు నెలలుగా విద్యార్థిని కడుపునొప్పితో బాధ పడుతోంది. రెండు రోజులుగా కడుపునొప్పి ఎక్కువ కావడంతో ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన తమ్ముడు చూసి చుట్టుపక్కల వారిని కేకలు వేయగా తలుపులు పగులకొట్టి బయటకు తీశారు. ఆటోలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే హారిక (16) మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.