రాంబిల్లి: మండలలో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పలు పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమణమూర్తి ఆధ్వర్యంలో, డాక్టర్ ఎబిఎం. శిరీష, యలమంచిలి వ్యవసాయ సహాయ సంచాలకులు సి. సుమంత సోమవార పొలాలను సందర్శించారు. వరిలో ఎక్కడైనా అధికంగా నీరు చేరితే తీసివేయాలని, వర్షం తగ్గిన తరువాత 20 నుంచి 25 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, చిరు పొట్ట దశలో ఉన్న వరి పొలాలకు యూరియా 35 కేజీలు ఎకరానికి వేసుకోవాలని సూచించారు. వరిలో ఆకు ముడత ఆశించిన పొలాల్లో వర్షం తగ్గిన తరువాత ఎసిఫిట్ ఒక గ్రా" లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. చెరకులో అధికంగా నీరు నిలబడితే వెంటనే తీసివేయాలని, తోట నేల వాలితే నిలబెట్టి జడలు కట్టాలని, చెరకు పొలాలకు 25 కేజీలు యూరియా, 25 కేజీలు పొటాష్ ఎకరానికి వేయాలని రైతులకు తెలియజేశారు.