భారతదేశంలో లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మతోన్మాదులని తరిమికొట్టాలని ఏఐఎస్ఎఫ్ ఏఐ వై ఎఫ్ జాతీయ నాయకులు బుధవారం నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 24వ జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతున్న సందర్భంగా కేరళ కొల్లం నుండి బయలుదేరిన యంగ్ కమ్యూనిస్టు ఫ్లాగ్ మార్చ్ ఈరోజు ఉదయం 11 గంటలకి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా నాయుడుపేట చేరుకున్నది.
ముందుగా డాక్టర్అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు సుజంధర్ మహేశ్వరి, తిరుమలై రామన్ ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ మాట్లాడుతూ భారతదేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసి మతోన్మాదం వైపు నడిపిస్తున్నారని, ప్రభుత్వ సంస్థలన్నీ కార్పొరేట్ కబంధహస్తాలకు అప్పగించారన్నారు. నరేంద్ర మోడీ అబద్దపు మాటలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని అన్నారు.
దేశ ప్రజలు లౌకిక వాదం వైపు ఉంటారా మతోన్మాదం వైపు ఉంటారా తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలపారు. దేశ రక్షణ కోసం విజయవాడ నగరంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈ మహాసభలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విదేశీ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశ ప్రభుత్వం లౌకిక వాదాన్ని కాపాడుకోవడం కోసం పనిచేసే పార్టీలవైపు ఉంటారా మతోన్మాద పార్టీ భాజపా వైపు ఉంటారా తెలుసుకోవాలని తెలపారు.
ఈ ర్యాలీలో సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యదర్శి సీహెచ్. సుధాకర్ రెడ్డి, ఏవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వల్లివుల్లా ఖాద్రి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్సన్ బాబు , శివారెడ్డి , ఏఐటియూసి నియోజకవర్గ కార్యదర్శి ఈ నాగేంద్రబాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మోదుగులు వినోద్ కుమార్, ఏఐఎస్ఎఫ్ సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యదర్శి తేరే సూర్య, ఏఐటియూసి నాయుడుపేట నాయకులు రామచంద్రయ్య , టి. నాగేంద్రబాబు సీపీఐ నగర జాయింట్ సెక్రెటరీ సీహెచ్. బాలు వసుంధర, కిరణ్, వెంకటరమణ విద్యార్థులు మరియు యువజన నాయకులు పాల్గొన్నారు.