వైసీపీ మంత్రులపై జరిగిన దాడి కేసులో కొంతమంది జనసేన నేతలకు ఊరట లభించింది. అరెస్టు అయినవారిలో 62 మందికి రూ. 10వేల పూచీకత్తుపై హైకోర్టు విడుదల చేసింది. మరో తొమ్మిది మందికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తొమ్మిది మందిపై మొదట హత్యానేరం కేసు నమోదు చేయగా.. దానిని తీవ్రగాయం చేసిన కేసుగా మార్చడంతో వారికి కొంత ఉపసమనం లభించింది. విశాఖలోని 7వ అదనపు మేజిస్ట్రేట్ ఎదుట రాత్రి అరెస్టు చేసిన జనసేన నేతలను హాజరుపరిచారు. వారిని కోర్టుకు తరలించే సమయంలో ప్రాంగణంలోని అన్ని గేట్లు మూసివేశారు. మొత్తం 92 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో 71 మందిని అరెస్టు చేసినట్లు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. వారిలో 61 మందికి బెయిల్ లభించిందని 9 మందికి కోర్టు రిమాండ్ విధించిందని ఆ పార్టీ పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు కనీసం నిబంధనలు పాటించలేదని జనసేన లీగల్ సెల్ ఆరోపించింది. జనసేన నేతలపై కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రూల్స్ పాటించడంలేదని ఆరోపించారు. మంత్రులపై దాడి 4 గంటలకు జరిగిందని, తాను మూడు గంటలకు వినానాశ్రయం వీఐపీ లాంచ్‌లో ఉన్నానని చెప్పారు. మరి దాడిలో ఎలా ఉంటానని ఆయన ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో తనపై కేసు నమోదు చేశారో పోలీసులు చెప్పాలని శివశంకర్ డిమాండ్ చేశారు.