జగన్ రెడ్డి తానేదో సచ్ఛీలుడైనట్టు, తనను బూతులు మాట్లాడుతున్నారంటూ నంగనాచి కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని బంగాళాఖాతంలో కలపాలని, కాల్చిచంపాలని, నడిరోడ్డుపై ఉరితీయాలని అన్నప్పుడు జగన్ రెడ్డికి భాష గుర్తులేదా? అని నిలదీశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వాడే పదజాలం, బూతులు, వారి వ్యవహారశైలి జగన్ కు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. బూతుల్లో పుట్టి పెరిగి, నిత్యం బూతులు వల్లించే వారితోనే పాలన చేస్తున్న జగన్ రెడ్డి బూతులు, భాష గురించి మాట్లాడుతుంటే గురివింద గింజ గుర్తొస్తోందని ఆమె విమర్శించారు. పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సీఎం జగన్ ఇవాళ చేసిన విమర్శలపై పీతల సుజాత పైవిధంగా స్పందించారు.
ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారిని తన పేటీఎం బ్యాచ్ తో మానసికంగా వేధించి, వారితో కన్నీళ్లు పెట్టించిన జగన్, బూతుల గురించి రాగాలు తీయడం సిగ్గుచేటు అని పీతల సుజాత వ్యాఖ్యానించారు. మహిళలు ఎవరి హయాంలో గౌరవంగా తలెత్తుకు తిరిగారో, ఎవరి పాలనలో కన్నీళ్లతో విలపిస్తున్నారో చర్చించడానికి ముఖ్యమంత్రి సిద్ధమా? అంటూ ఆమె సవాల్ విసిరారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, వారికి గుర్తింపునిచ్చింది స్వర్గీయ ఎన్టీఆర్ అయితే, ఆడబిడ్డలకు అన్నగా, వారి కష్టసుఖాల్లో తోడునీడగా నిలిచింది చంద్రబాబు అని పీతల సుజాత వివరించారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి రోజాపైనా విమర్శలు చేశారు. నగరి నియోజకవర్గంలో తన పని అయిపోయినట్టేనని రోజా తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. విశాఖ విమానాశ్రయంలో ఆమె హావభావాలు, వెకిలివేషాలు ఎలా ఉన్నాయో చూశాం అని పీతల సుజాత వ్యాఖ్యానించారు.