క్రీడాకారులను ప్రోత్సహించి శిక్షణ ఇచ్చేందుకు పర్చూరులో నిర్మించిన ఎన్‌టిఆర్ క్రీడా వికాస కేంద్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. పర్చూరు శివార్లలోని వైఆర్ హైస్కూలు ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఎన్‌టిఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించారు. దీని కోసం 4. 25 ఎకరాల స్థలాన్ని పాఠశాల యాజమాన్యం తరపున కరస్పాండెంట్ యార్లగడ్డ ఉమాదేవి దానం చేశారు.
నియోజకవర్గ కేంద్రంలో క్రీడా వికాస కేంద్రాలు నిర్మించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం రూ. 2 కోట్లు నిధులు మంజూరు చేసింది. అప్పటి క్రీడా శాఖా మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్‌టిఆర్ క్రీడా వికాస కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంవత్సర కాలంలో పనులు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ బిల్లులు చెల్లింపు, ఇసుక కొరత కారణంగా పనులు ముందుకు సాగలేదు.
అన్ని అవరోధాలను అధిగమించి రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇండోర్ జిమ్, షటిల్, ఉడెన్ కోర్టు ఏర్పాటు చేశారు. భవనంలో 5 గదులు నిర్మించారు. ఒకటి కార్యాలయానికి, మిగిలిన నాలుగు క్రీడాకారులకు ఉపయోగించనున్నారు.
ఈ నేపధ్యంలో క్రీడా ప్రాంగణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారోనని క్రీడాకారులు ఎదురు చూస్తున్నారు. ఈ వికాస కేంద్రం ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.