ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇంటివద్దే మెరుగైన వైద్య సేవలందుతాయని హిందూపురం కలెక్టర్ బసంత్‌కుమార్ అన్నారు. విలేజ్ క్లినిక్‌లో ఓ డాక్టర్, పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, వలంటీర్లు ఉంటారని చెప్పారు. హిందూపురం నియోజకవర్గంలోని గోళాపురం గ్రామంలో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్‌ను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న గర్భిణితో పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన తూమకుంట పారిశ్రామికవాడలోని విప్రో, ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు, తయారయ్యే ఉత్పత్తులు, ఫ్యాక్టరీలో వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కారి్మకుల స్థితిగతులను వారినే అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక వేత్తలు సమీపంలోని గ్రామాలను దత్తత తీసుకుని సామాజిక బాధ్యత కింద అభివృద్ధి చేయాలని కోరారు.