దీపావళి పండుగను పురష్కరించుకొని ప్రమిదల వెలుగు, విద్యుత్ కాంతులతో అయోధ్య వీధులన్నీ వెలిగిపోయాయి. అయోధ్య నగరంలో దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్ సంబరాలు అంబరాన్ని తాకాయి. అదివారం రాత్రి సరయు నది తీరంలో రామ్ కి పైడి వద్ద 15 లక్షలకు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఉత్తరప్రదేశ్ అవధ్ విశ్వవిద్యాలయానికి చెందిన 22 మంది వాలంటీర్లు 15 లక్షల 76 వేల ప్రమిదలు వెలిగించి గిన్నిస్ రికార్డులో భాగం అయ్యారు. ఈ దీపోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఆయోధ్యలో రాముడిని దర్శించుకున్న మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామ మందిరం కోసం భూమి పూజ చేసిన శ్రీరామలయాల్లోను పూజలు చేసిన మోదీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణ పనులను సమీక్షించారు. అనంతరం శ్రీరాముడి లాంఛనప్రాయ పట్టాభిషేకంలో పాల్గొని సీతారాముళ్లకు హారతి ఇచ్చారు. ఆ తర్వాత మోదీ సమక్షంలో అయోధ్యలో బాణసంచా, లేజర్ షో కార్యక్రమాలు జరిగాయి. ప్రమిదల వెలుగు, విద్యుత్ కాంతులతో అయోధ్య వీధులన్నీ వెలిగిపోయాయి.