భారత ఎన్నికల సంఘం మరింత భద్రంగా, ఆకర్షణీయంగా కొత్త ఓటరు గుర్తింపు కార్డులను తీసుకొచ్చింది. నకిలీ కార్డుల తయారీకి చెక్ పెట్టడం, ఓటరు వివరాల భద్రత తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇటీవల కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి ఈ కార్డులను ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మునుగోడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లకు ఈ కార్డులను ఉచితంగా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిణీ చేస్తోంది. పాతవారికి గతంలో జారీ చేసిన ఓటరు కార్డులు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. నూతన కార్డు ముందు భాగంలో నాలుగు సింహాల జాతీయ చిహ్నం, ధర్మచక్రం, కార్డుదారుడి సూక్ష్మ చిత్రాన్ని నిక్షిప్తం చేశారు. ఓటరు వివరాలను మైక్రోటెక్ట్స్ రూపంలో ముద్రించారు. భారతదేశ చిత్రపటం కార్డుకు రెండు వైపులా కనిపించేలా ఉటుంది. తంలో కార్డు వెనుకవైపు ఓటరు చిరునామా, నియోజకవర్గం వివరాలు ఉండేవి. నూతన కార్డులో క్యూఆర్ కోడ్, ఓటరు చిరునామా, నియోజకవర్గాన్ని ముద్రించారు. ఈ క్యూఆర్ కోడ్‌ను ప్రత్యేక స్కానర్ ద్వారా స్కాన్ చేస్తేనే ఓటరు సమాచారం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు.