తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ‘జగనన్న సాంస్కృతిక సంబరాలు’ పేరుతో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా 40 వేలమందికి పైగా కళాకారుల ప్రదర్శనలకు వేదికలు సిద్ధం చేస్తోంది. వెయ్యిమందికి పైగా కళాకారులతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాచీన కళావైభవం చాటేలా ప్రణాళికను రూపొందించింది. ప్రధానంగా కూచిపూడి, కొమ్ముకోయ, థింసా, తప్పెటగుళ్లు, గరగలు, పగటివేషాలు, బుర్రకథలు, ఆర్కెస్ట్రా (జానపద, సంప్రదాయ, గిరిజన) వంటి కళారూపాలను ఆవిష్కరించనుంది. సీఎం వైయస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 19, 20 తేదీల్లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనుంది. కళాకారులు, కళాబృందాలు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. సాంస్కృతిక శాఖ https://culture.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులను పూర్తిచేసి పంపవచ్చు. విజయవాడలోని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి కార్యాలయంతో పాటు విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలుల్లోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను apculturalcompetitions@gmail.comకు మెయిల్‌చేసే వెసులుబాటు కూడా కల్పించారు.