తిరుపతిలో నాయి బ్రాహ్మణులపై విజిలెన్స్ అధికారులు అక్రమంగా దాడులు చేయడం దుర్మార్గమని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఖండించారు. శుక్రవారం పుట్టపర్తి సాయి ఆరామంలో ఆ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తిరుమలలో కళ్యాణ కట్ట వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతూ అక్కడి నాయి బ్రాహ్మణులు రెండు రోజులపాటు తలనీలాలు తీయడం మానుకొన్నారు. దీనిని సాకుగా తీసుకొని విజిలెన్స్ అధికారులు నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషించి దాడులు చేశారని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కులం పేరుతో దూషించరాదని ప్రభుత్వం జీవో కూడా చేసిందన్నారు. దాడులు చేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా నాయకులు శ్రీనివాసులు, రమేష్, మారుతి ప్రసాద్, రవి పట్టణ నాయకులు రాజా, చలపతి, ప్రవీణ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.