సోషల్ మీడియా వేదికలపై చట్టవిరుద్ధమైన కంటెంట్, తప్పుడు సమాచారానికి చోటివ్వని రీతిలో ఆయా కంపెనీలు ఇకపై మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సవరించిన ఐటీ నియమావళితో సోషల్ మీడియా కంపెనీలపై బాధ్యత మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.
ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వేదికల్లో పోస్టు చేసే కంటెంట్ పై ఫిర్యాదుల కోసం కేంద్రం త్వరలోనే అప్పిల్లేట్ ప్యానెల్ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలకు నిన్న అంగీకారం తెలిపింది. ముగ్గురు సభ్యుల ఈ అప్పిల్లేట్ ప్యానెల్ ఏర్పాటుపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ, ఫిర్యాదులపై సోషల్ మీడియా సంస్థలు స్పందించడం లేదంటూ లక్షల సంఖ్యలో సందేశాలు వస్తున్నాయని వివరించారు. సోషల్ మీడియా కంపెనీలు ఈ తరహా నిర్లక్ష్య ధోరణులు అవలంబించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన హెచ్చరించారు.
డిజిటల్ నాగరికుల (నెటిజన్లు) ప్రయోజనాలకు భరోసా ఇచ్చేలా సామాజిక మాధ్యమ సంస్థలు తమతో కలిసి రావాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థల ప్రధాన కార్యాలయాలు అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నా సరే, భారత్ లో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు ఇక్కడి రాజ్యాంగ హక్కులకు లోబడే పనిచేయాల్సి ఉంటుందని రాజీవ్ చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. వర్గాల మధ్య వైషమ్యాలకు దారితీసే అభ్యంతరకర కంటెంట్, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా కంపెనీలు 72 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.