ట్విట్టర్ ను హస్తగతం చేసుకొన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దానిపై తనదైన ముద్రను ప్రదర్శించబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ట్విట్టర్ లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు నామమాత్రపు రుసుముతో అందించిన సేవల్లో మార్పులు చేయబోతున్నట్లు ఓ ట్వీట్ ద్వారా మస్క్ సూచన చేశారు. ట్విట్టర్ యూజర్లలో సెలబ్రెటీల ఖాతాలకు బ్లూ చెక్ మార్క్ ఉంటుంది. ఈ మార్క్ ఉందంటే సదరు ఖాతా ఒరిజినల్ గా ఆ సెలబ్రిటీనే వాడుతున్నాడని అర్థం. ట్విట్టర్ ప్రతినిధులు ఆయా సెలబ్రెటీలను సంప్రదించి, వారి ఖాతాలను నిర్ధారించాకే ఈ బ్లూ చెక్ మార్క్ బాడ్జ్ ను తగిలిస్తారు. ఈ వెరిఫికేషన్, బ్యాడ్జ్ ఇవ్వడం వల్ల సెలబ్రెటీలకు నకిలీల బెడద తప్పుతుంది. అదే సమయంలో ఆయా సెలబ్రెటీల అభిమానులకు స్పష్టత ఉంటుంది.
బ్లూ చెక్ మార్క్ కోసం ఇప్పటి వరకు చేస్తున్న వెరిఫికేషన్ ప్రక్రియలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు ఎలాన్ మస్క్ ఆదివారం ఓ ట్వీట్ లో వెల్లడించారు. ఇందులో భాగంగా బ్లూ చెక్ మార్క్ కావాలనుకునే యూజర్లు ఇప్పటి వరకు నెలకు 4.99 (మన రూపాయల్లో దాదాపు 410) అమెరికా డాలర్లు చెల్లిస్తున్నారు. ఇకపై దీనిని నెలకు 19.99 (మన రూపాయల్లో దాదాపు 1650) అమెరికా డాలర్లకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.