కొంతకాలంగా కాకినాడనుంచి ఇతర ప్రాంతాలకు డ్రగ్స్, గంజాయి అక్రమ మార్గాన రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మాదకద్రవ్యాలను కొరియర్ పార్సిల్ ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించిన కాకినాడ కొరియర్ నిర్వాహకులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచి పోలీసులు డ్రగ్స్, గంజాయిని పార్సిళ్లలో పంపుతుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ దాడిలో 14మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరిని కాకినాడ రూరల్‌లోని ఓ పోలీస్‌స్టేషన్, కాకినాడ సిటీకి చెందిన పలు పోలీస్‌స్టేషన్లకు తరలించి స్పెషల్ బ్రాంచి పోలీసులు విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కొరియర్ ద్వారా ఎప్పటినుంచి అక్రమ మార్గాన ఎవరికి, ఎక్కడెక్కడకు తరలిస్తున్నారు, సరఫరాదారుడు ఎవరు, వ్యాపారులు, వినియోగదారులు ఎవరు, ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాముల పాత్రపై పోలీసులు లోతుగా విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.