తీసుకున్న అప్పు చెల్లించడం లేదని ఓ యువకుడిని కిరాతకంగా బ్లేడుతో గొంతు కోసి చంపేశారు. శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం దేవరాపల్లి గ్రామ సమీపంలో గతనెల 27న జరిగిన అదే గ్రామానికి చెందిన బర్లె నాగరాజు (35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళ్ళితే... విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికా యపాలవలస పంచాయతీ కలిశెట్టిబడి గ్రామానికి చెందిన యండవ గణేష్ (19) ఇల్లు, బర్లె నాగరాజు అత్తగారి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. ఈ పరిచయంతో నాగరాజు తన భార్య వైద్యఖర్చుల కోసం గణేష్ వద్ద రూ.45వేలు అప్పుగా తీసు కున్నాడు. దీన్ని తిరిగి చెల్లించకపోగా, ఇవ్వకుంటే ఏమి చేస్తావు అని గణేష్‌తో నాగరాజు అన్నాడు. దీంతో నాగరాజును హత్య చేసేందుకు గణేష్ పథకం వేశాడు. ఊరి బయట ఉన్న నాగరాజును మందు పార్టీ చేసుకుందామని చెప్పి గణేష్ తన బైక్ మీద ఎక్కించుకున్నాడు. కొండ వైపు వెళ్లే కచ్చారోడ్‌కు తీసుకెళ్లి అక్కడ నాగరాజుకు ఫుల్‌గా మద్యం తాగించాడు. ఆ తర్వాత కర్రతో ఎడమవైపు కణితిపై కొట్టాడు. అనంతరం మెడపై బ్లేడుతో కోసి నాగరాజు సెల్‌ఫోన్‌ను గణేష్ తీసుకెళ్లిపోయాడు. నాగరాజు తండ్రి నీలకంఠం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్యకు గల కారణాలపై ఆరాతీసి.. తమదైన శైలిలో నాగరాజును విచారించారు. దీంతో నాగరాజును హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కర్ర, బ్లేడ్, రక్తపు మరకలతో ఉన్న నాగరాజు షర్టు, సెల్‌ఫోన్, హీరో హోండా బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణేష్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నామని డీఎస్పీ తెలిపారు.