రోడ్లపై గుంతలే పూడ్చలేని ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు కడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ముందు రహదారులపై భారీ ఎత్తున దర్శనమిస్తున్న గోతు లను పూడ్చండని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. నాదండ్ల మండలంలోని కనపర్రు, మైనంపాడు, మల్లాయపాలెం గ్రామాల్లో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఒక కిలో మీటరు రోడ్డు కూడా వేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మూడు వేల జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చామని, గొప్పలు చెప్పుకుంటున్నారే గానీ, ఇప్పటి వరకు అందిన చికిత్సలకు డబ్బులు చెల్లించలేని దిక్కు మాలినస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సీఎంజగన్ వైఖరి చూస్తుంటే గాలిపీల్చినా, వదిలినా పన్నులు వేసేలా ఉన్నారని, కుడి చేత్తో పది రూపాయలిచ్చి ఎడం చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నారని విమర్శించారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చాక నిత్యవసరాలు, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీతో సహా అన్ని రకాల చార్జీలను పెంచి ప్రజలపై పెను ఆర్థిక భారం మోపారన్నారు. వైసీపీ పోయి టీడీపీ వస్తేనే భావి తరాలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బండారు సత్యనారాయణ, స్థానిక నాయకులు పూదోట అంతయ్య, జయప్రసాదు, వజ్జె సింగయ్య, నాతాని రాఘవయ్య, ఖాజా మొహిద్దీన్, వేముల బాలరాజు, పీటర్, కట్టా ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు.