పుట్టపర్తి నగర పంచాయతీని గ్రేట్ 2 మున్సిపాలిటీగా మార్పు చేయడానికి కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. చైర్మన్ తుంగ ఓబుళపతి అధ్యక్షతన శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో ముఖ్యఅతిథిగా శాసనసభ్యుడు దద్దుకుంట శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టపర్తి నగర పంచాయతీలో జనాభా పెరిగిందని, అందుకు తగ్గట్టుగా అవసరాలు పెరిగాయని, ఆర్థిక వనరులు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు గ్రేట్ 2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందితే ప్రభుత్వం నుంచి ఆర్థిక వనరులు అధికంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. అందుకు పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించడానికి ఆమోదం తెలిపారు. అనంతరం సత్యసాయి జన్మదిన వేడుకల ఏర్పాట్లపై చర్చించారు. కౌన్సిలర్లకు మౌలిక సదుపాయాల కల్పనలో బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకటరామిరెడ్డి, సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, ఎఇ స్వాతి, వైస్ చైర్మన్లు శ్రీలక్ష్మీ నారాయణ రెడ్డి, తిప్పన్న, కౌన్సిలర్లు సాయి గీత, సూర్య గౌడ్, లక్ష్మీపతి, చెరువు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.