దేశంలో అత్యంత ప్రసిద్ధ దేశాలయం శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది.వార్షిక మండలం-మకరవిళక్కు పుణ్యకాలం నవంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో రేపు గురువారం నుంచి శబరిమల ఆలయ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఆలయం గర్భగుడిని బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు(తంత్రి) కదరారు రాజీవరు సమక్షంలో మరో అర్చకులు ఎన్ పరమేశ్వరన్ నంబూత్రి తెరవనున్నారు. దర్శనాల కోసం భక్తులు ఆన్‌లైన్ సేవలు ఉపయోగించుకోవాలని కోరిన ట్రావెన్‌కోర్ దేవస్థానం వెల్లడించింది.అయ్యప్ప ఆలయం, మలికప్పురం ఆలయాలకు కొత్తగా ఎంపిక చేయబడిన ప్రధాన అర్చకులు ఒక సంవత్సరం పాటు పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజా ఉత్సవాలు డిసెంబర్ 27న ముగుస్తాయి. జనవరి 14,2023న మకరజ్యోతి తీర్థయాత్రం కోసం మళ్లీ డిసెంబర్ 30న ఆలయం తెరబడుతుంది. భక్తుల దర్శనం తరువాత జనవరి 20న స్వామివారి ఆలయం మూసేయనున్నారు. గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్ ఆంక్షలు ఎత్తేయడంతో ఈ ఏడాది తొలిసారిగా యాత్రికులు వస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో అయ్యప్పస్వామిని భక్తులు దర్శించుకుంటారని కేరళ అధికారులు భావిస్తున్నారు. యాత్రకు సంబంధించి కేరళ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టింది. భద్రతా ఏర్పాట్లను చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
పతినంతిట్ట జిల్లాలోని శబరిమల ఆలయానికి ప్రతీ ఏటా లక్షల్లో భక్తులు వస్తుంటారు. అయ్యప్పస్వామి దీక్షను చేపట్టే వారు స్వామి దర్శనం కోసం శబరిమల వెల్లడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల వెళ్తుంటారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో గత రెండేళ్ల నుంచి ఆలయదర్శనానికి భక్తులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సారి ఆంక్షలు ఎత్తేయడంతో పెద్ద సంఖ్యలో అయ్యప్పస్వామిని భక్తులు దర్శించుకోనున్నారు.