జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామంలో బుధవారం ఉదయం వరి పొలంలో కలుపుమొక్కలు తీస్తుండగా మహిళా రైతు విద్యుత్ తీగ తెగిపడి ఘటనా స్థలంలో మృతిచెందారు. వివరాల్లోకి వెళ్ళితే ... తిప్పయ్యగారి సువర్ణ, ఆమె భర్త వెంకటసుబ్బయ్య దంపతులకు పెద్దదండ్లూరు గ్రామ శివార్లలో మూడున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో వీరు వరి సాగు చేశారు. బుధవారం ఉదయాన్నే సువర్ణ వరి పొలంలో కలుపు తీయడానికి వెళ్లింది. పొలంలో దిగి కలుపుమొక్కలు తీస్తుండగా అక్కడే ఉన్న 11 కేవీకి సంబంధించిన విద్యుత్ తీగ తెగిపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహంపై విద్యుత్ తీగ అలానే ఉండడం స్థానికులు గమనించి గ్రామస్థులకు తెలియజేశారు. ఆమె కుటుంబసభ్యులు, సర్పంచ్ గువ్వల రామాంజనేయరెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని సువర్ణ మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సదాశివయ్య తెలిపారు.