భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2023 శోభకృత సంవత్సరంలో శ్రీరామనవమి తరువాత నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి దేవస్థానం వైదిక కమిటీ, పరిపాలన అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలనే యోచనలో దేవస్థానం వర్గాలు ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రులను సైతం సంప్రదాయ రీతిలో ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని చినజీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్ణయించాలని యోచిస్తున్నారు. అలాగే వివిధ వైదిక సంప్రదాయాలకు చెందిన పీఠాధిపతులను రోజుకు ఒకరిని ఆహ్వానించాలని భావిస్తున్నారు.