ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్్ ఎన్నికల్లో దినసరి కూలీ......రూపాయి నాణేలిచ్చి నామినేషన్

national |  Suryaa Desk  | Published : Sun, Nov 20, 2022, 03:01 PM

గుజరాత్ లోని ఓ దినసరి కూలీ తమ బతుకుల్లో వెలుగు కోసం నేతలను నమ్ముకొంటే వచ్చేది ఏమీ లేదని భావించి స్వయంగా ఎన్నికల్లో దిగితేేనే జీవితాల్లో మార్పు అని భావించాడు. ఈ క్రమంలోనే గాంధీనగర్‌ నార్త్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఓ దినసరి కూలీ.. నామినేషన్ వేసేందుకు వచ్చాడు. అధికారులు రూ.10,000 డిపాజిట్‌గా చెల్లించాలని కోరగా.. తన వద్ద ఉన్న రెండు సంచులను తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆ సంచుల్లో మొత్తం రూపాయి నాణేలు ఉన్నాయి. 10 వేల రూపాయి నాణేలను చూసి ఎన్నికల అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే, వాళ్లను ఆశ్చర్యపరిచేందుకే ఆ దినసరి కూలీ ‘మహేంద్ర పత్నీ’ అలా చేయలేదు. దీని వెనుక ఒక విషాద కథ ఉంది. ఈసారి ఎన్నికలతోనైనా తమ కన్నీటి వెతలకు తెర పడుతుందనే ఆశ ఉంది.


గాంధీనగర్‌లోని రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ స్లమ్ ఏరియాలో మహేంద్రభాయ్ పత్నీ నివసిస్తున్నాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెక్కడితే గానీ డొక్కాడదు. ఆ మురికివాడల్లో తన లాంటి 521 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిపై అధికారులు తరచూ తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఖాళీ చేయించారు. ఇప్పుడు మూడోసారి ఖాళీ చేయించేందుకు సిద్ధమయ్యారు. తమ ఇళ్లకు తాగునీరు, కరెంట్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు.


ఏళ్లుగా ఈ కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతాన్ని 2010లో తొలిసారిగా బలవంతంగా ఖాళీ చేయించారు. నాడు అక్కడ ‘దండి కుటీర్’ మ్యూజియాన్ని నిర్మించారు. మహాత్మా గాంధీకి నివాళిగా నిర్మించిన ఈ మ్యూజియం కోసం.. ఆయన ఆశయాలకు విరుద్ధంగా నిరుపేదలను తన్ని తరిమేశారు. అక్కడికి సమీపంలో మరో ప్రాంతంలో మురికి కాల్వ వెంట గుడిసెలు వేసుకున్నారు ఆ నిరాశ్రయులందరూ. ఖాళీ చేయించిన సమయంలో వారికి ఇచ్చిన హామీలను ఇంతవరకూ నెరవేర్చలేదు.


2019లో వీరిని మరోసారి బలవంతంగా ఖాళీ చేయించారు. అక్కడ లీలా హోటల్ నిర్మాణం కోసం వారి ఇళ్లను కూలగొట్టారు. 521 కుటుంబాలూ పిల్లాపాపలతో రోడ్డున పడ్డాయి. అక్కడికి కాస్త దూరంలో మరొక ఆవాసాన్ని నిర్మించుకొని వీరంతా ఆశ్రయం పొందుతున్నారు. ఎలాంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదని మహేంద్రభాయ్‌ పత్నీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


‘మా వాళ్లందరికీ న్యాయం కావాలి. అందుకే తమ ప్రతినిధిగా నన్ను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగా. నాకు మద్దతు ఇవ్వాలనుకుంటున్న వారందరి నుంచి ఒక్కో రూపాయి విరాళంగా సేకరించా. ఆ మొత్తాన్ని డిపాజిట్ చెల్లించేందుకు తీసుకొచ్చా’ అని మహేంద్ర పత్నీ చెప్పారు.


మహేంద్ర పత్నీకి ఇప్పటివరకూ బ్యాంకు అకౌంట్‌ కూడా లేదు. ఎన్నికల్లో పోటీ చేసే వారికి బ్యాంకు అకౌంట్‌ తప్పనిసరి అని చెప్పడంతో జీరో బ్యాలెన్స్‌ ఖాతా తెరిచాడు. తనకు ఎలాంటి స్థిర, చరాస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. గాంధీనగర్‌ స్టేషన్‌ రోడ్డులోని ఓ పూరిగుడిసెలో తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి జీవిస్తున్నట్లు వెల్లడించాడు. ‘మా బాగోగులు పట్టించునేవారెవరూ లేరు. ఇప్పటివరకూ ఏ రాజకీయ నాయకుడూ మా వద్దకు రాలేదు. ప్రభుత్వం మా ఇళ్లకు కరెంట్, తాగునీరు ఇస్తే.. కనీస సదుపాయాలు కల్పిస్తే, ఈ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటా’ అని మహేంద్ర పత్నీ అంటున్నారు.


ఈ మురికివాడలో నివసించే వారిలో ఎక్కువ మంది చక్రాల బండిపై కూరగాయాలు, ఇతర వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, అధికారులు తరచూ వీరి బండ్లను సీజ్ చేస్తున్నారు. రూ.2 వేలు, 3 వేలు ఇస్తేగానీ విడిచిపెట్టట్లేదట. ‘ఈ వేధింపులన్నీ ఆగిపోవాలి..’ అని మహేంద్ర పత్నీ డిమాండ్ చేస్తున్నారు. నామినేషన్ వేయడంతోనే అందరి దృష్టినీ ఆకర్షించి ఆయన తన ఆశయ సాధనలో సగం విజయం సాధించారు..! పూర్తిగా గెలవాలి, తన వాళ్లను గెలిపించాలని కోరుకుందాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com