యర్రగుంట్ల మండల పరిధిలోని చిన్నదండ్లూరు గ్రామంలో కలమల్ల పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం నాకాబందీ నిర్వహించారు. ఎస్ఐ శివప్రసాద్ సిబ్బందితో కలిసి గ్రామాన్ని జల్లెడ పట్టారు. అనుమానిత నివాస గృహాలలో సోదాలు నిర్వహించారు. పోలీసుల రికార్డులలో చిన్నదండ్లూరు అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఉంది. ఈ సందర్భంగా ఎస్ఐ శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంత వాతావరణంలోనే జీవనం కొనసాగించాలని, ఘర్షణలకు పాల్పడి శాంతికి భంగం కలిగిస్తే చట్టపర కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొడవల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు.