ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోందన్నారు. ఏటా ఇన్‌పుట్ సబ్సిడీ అందించడంతోపాటు, ఉచిత పంటల బీమా వంటి పలు సదుపాయాలు కల్పించిందన్నారు. ఆర్బీకేల ద్వారా నిరంతరం వారికి అవసరమైన సేవలు అందిస్తోందని తెలిపారు. మార్కెట్‌లో రైతు పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా చూస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కనీస మద్దతు ధర దక్కని ఖరీఫ్ ఉత్పత్తుల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు. ధాన్యంతో పాటు అన్ని రకాల ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపడుతోందని వివరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ఇంటింటి కొళాయి కనెక్షన్లకు రూ. 852.96 కోట్ల మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జెడ్పీ సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్ లు సూర్యకుమారి , నిశాంత్ కుమార్, శాసనసభ్యులు శంబంగి వెంకట చినప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య , కడుబండి శ్రీనివాస రావు, పాముల పుష్ప శ్రీవాణి, అలజంగి జోగారావు, శాసనమండలి సభ్యులు సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు , రఘు వర్మ , ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.