మలేసియా ప్రధానిగా 75 ఏళ్ల అన్వర్ ఇబ్రహీం గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో అన్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో, కొన్నిరోజులుగా మలేసియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెర పడింది. ఏ పార్టీకి కానీ, కూటమికి కానీ మెజారిటీ రాకపోవడం మలేసియాలో 1957 తరువాత ఇదే ప్రథమం. 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి, జైలు శిక్షలు అనుభవించి, సంస్కరణల కోసం గట్టిగా నిలబడిన అన్వర్ అధికారం చేపట్టడంతో దేశంలో ఆశాభావం వెల్లివిరుస్తోంది. స్టాక్ మార్కెట్ సూచీలు, మలేసియా కరెన్సీ విలువ పెరిగాయి.