ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నలుగురు రెడ్ల చేతిలో ఏపీ సర్కార్ : రఘురామకృష్ణరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 02:10 PM

ఏపీ ప్రభుత్వం నలురుగు రెడ్ల చేతుల్లోనే సాగుతోందని జగన్ ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర స్థాయిలో పైరయ్యారు. కులం, మతం చూడబోమంటూ సీఎం జగన్ తరచూ చెబుతున్న మాటలకు ఆయన చేతలకు పొంతన లేకుండా ఉందని ఎద్దేవా చేశారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ.. సీఎం జగన్ తన సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తూ.. పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను కాదని కడప జిల్లాకు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించారని రఘురామ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)గా సీఎం సొంత జిల్లాకు చెందిన జవహర్ రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కూడా పులివెందులకు చెందిన మరో ఐఏఎస్ అధికారి కంట్రోల్ చేస్తున్నారని రఘురామ ఆరోపించారు.


సీఎం జగన్‌ రెడ్డితో పాటు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, జవహర్‌ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారని అన్నారు. పార్టీ పరంగా నియమించిన కో ఆర్డినేటర్లలోనూ 90 శాతం సీఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని ఆక్షేపించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలకు అసలు చోటే కల్పించలేదని అన్నారు. కులం, మతం చూడబోనని పదే పదే చెప్పే జగన్.. ప్రాధాన్యత గల పోస్టుల్లో తన కులాన్ని మాత్రమే చూస్తారని రఘురామ దుయ్యబట్టారు. రాష్ట్రంలో పేరుకే మాత్రమే సీఎం జగన్ బీసీ ఉపముఖ్యమంత్రులను నియమించారన్నారు. వారికి కనీస బాధ్యతలను కూడా అప్పగించలేదని అన్నారు. ప్రజల పక్షాన నిలబడిన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం ప్రతిపాదించడం సహేతుకంగా లేదని రఘురామ అన్నారు. ఈ బదిలీ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.


ఇదిలా ఉండగా.. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఎంపీ రఘురామకు ఇటీవల సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులపై స్పందించిన రఘురామ.. ఢిల్లీలో ఉన్న తన నివాసానికి నోటీసు పంపించారని తెలిపారు. ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. "ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి చాలా మందితో ఫోటోలు దిగాల్సి ఉంటుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 32 కేసుల్లో నిందితునిగా ఉన్నారు. మరి ఆయనతో 151 మంది ఎమ్మెల్యేలు దిగిన ఫొటోలున్నాయి. అంత మాత్రాన ఆ ఎమ్మెల్యేలంతా నేరస్థులు కాలేరు కదా. కిషన్ రెడ్డి, నంద కుమార్ కలిసి ఉన్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. మరి కిషన్ రెడ్డికి కూడా నోటీసులు ఇస్తారా? సిట్‌ ఇచ్చిన నోటీసులకు నేను హాజరవుతా. సీఎం జగన్ నీడ తనపై పడకుండా చూసుకుంటా." అని రఘురామ తెలిపారు.


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందింతులైన రామచంద్ర భారతితో పాటు నందకుమార్‌, సింహయాజులను సిట్ అధికారులు ఇప్పటికే విచారించగా.. వారి ఫోన్లలో ఉన్న డేటాను పరిశీలించారు. ఆ సమాచారం అధారంగా పలువురిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే వారితో ఎంపీ కలిసి ఉన్న ఫొటోలు బయటపడగా.. ఈ కేసుతో సంబంధమేమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు ప్రశ్నించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa