తమ పూర్వీకుల పొలంలో జలవనరులశాఖ చెక్ డ్యామ్ నిర్మించిందంటూ దాన్ని పేల్చివేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో చోటుచేసుకుంది. గ్రామంలోని నల్లవాగులో 9.5 లక్షల వ్యయంతో జలవనరులశాఖ 2018లో చెక్ డ్యాం నిర్మించింది. కాగా, ఈ ప్రదేశం తమ పూర్వీకులదంటూ మల్లిఖార్జున అనే రైతు దాన్ని బాంబులతో పేల్చేశాడు. జలవనరులశాఖ ఫిర్యాదు మేరకు తహసీల్దార్ వేణుగోపాల్, సీఐ మారుతికృష్ణ మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సర్వే నెంబర్ 236-3లోని 4.77 ఎకరాల చుక్కల భూమిలో చెక్ డ్యాం ను నిర్మించారని, అది మల్లిఖార్జున పేరుపై లేదని తహసీల్దార్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు పాల్పడ్డ మల్లిఖార్జున పరారీలో ఉన్నాడు.