ఎట్టకేలకు మన మార్కెట్ లోకి డిజిటల్ కరెన్సీ ఎంట్రీ ఇచ్చింది. భవిష్యత్ లో కరెన్సీ నోట్లు కనిపించకపోవచ్చన్న నిపుణుల మాటలు నిజమే అనిపిస్తున్నాయి. అనేక దేశాలు డిజిటల్ కరెన్సీలను అమల్లోకి తెస్తుండడమే అందుకు కారణం. ఇప్పటికే ఆన్ లైన్ చెల్లింపులతో కరెన్సీ నోట్ల వినియోగం చాలావరకు తగ్గింది. డిజిటల్ కరెన్సీ రాకతో కరెన్సీ నోట్లు చరిత్రగా మారనున్నాయి.
తాజాగా భారత్ లోనూ డిజిటల్ కరెన్సీ రంగప్రవేశం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నేడు దేశంలో 'డిజిటల్ రూపీ'ని ఆవిష్కరించింది. డిజిటల్ రూపీ కోసం ఆర్బీఐ 8 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రెండు దశల్లో ఈ భాగస్వామ్యం కార్యరూపం దాల్చనుంది. డిజిటల్ రూపీని దేశ ప్రజలకు పరిచేయం చేసే తొలిదశలో ఆర్బీఐ... ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ లతో కలిసి పనిచేయనుంది.
ప్రస్తుతానికి ఇది పైలెట్ ప్రాజెక్టు కింద ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో అమల్లోకి తెస్తున్నారు. తదుపరి దశలో డిజిటల్ కరెన్సీని అహ్మదాబాద్, గాంగ్ టక్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా నగరాలకు విస్తరించనున్నారు. ఇదిలావుంటే డిజిటల్ రూపీ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా.... కొందరు కస్టమర్లను బ్యాంకులే ఎంపిక చేసుకుంటాయి. వారు కోరితే వారి ఖాతా నుంచి నగదును సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీడీబీసీ) వ్యాలెట్ కు సదరు బ్యాంకు బదిలీ చేస్తుంది. ఆ సీడీబీసీ వ్యాలెట్ లోని నగదు డిజిటల్ రూపీగా చలామణీ అవుతుంది. పైలెట్ ప్రాజెక్టు కాబట్టి, దీన్ని ప్రస్తుతానికి వినియోగదారులు, వ్యాపారుల మధ్య లావాదేవీల వరకే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా చైనా, జమైకా, ఘనా, బహమాస్ యూరప్ దేశాల్లో డిజిటల్ కరెన్సీ వాడుకలో ఉంది. ప్రపంచంలోనే మొదటిసారిగా బహమాస్ తన 'శాండ్ డాలర్' డిజిటల్ కరెన్సీని 2019లో ప్రవేశపెట్టింది.