ఏపీలోని విజయవాడ కేంద్రంగా వెలుగుచూసిన సంకల్ప సిద్ధి కుంభకోణం కేసులోతనకు గానీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి గానీ ఏమాత్రం సంబంధంలేదని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వెల్లడించారు. ఈ కేసు విషయంపై చర్చించేందుకు గురువారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆయన కలిశారు. డీజీపీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంకల్ప సిద్ధి కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డీజీపీని కోరినట్లు ఆయన తెలిపారు.
సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండానే తనపై ఆరోపణలు చేశారంటూ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు గానీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఈ కేసులో తనకు సంబంధం ఉందని ఆధారాలు ఉంటే... ఎలాంటి శిక్షకు అయినా సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన అన్నారు. ఈ కేసులో విజయవాడకు చెందిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడులపై డీజీపీకి ఫిర్యాదు చేశానని వంశీ పేర్కొన్నారు.