నమ్మి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, రైతుల్ని జగన్ నట్టేట ముంచారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సొంత బాబాయ్ ని చంపించేశావు... తల్లిని, చెల్లిని తరిమేశావు... జనం నిన్నెలా నమ్ముతారు? అంటూ సీఎం జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అడిగి గద్దెనెక్కిన జగన్ పాలన రాష్ట్ర ప్రజల పాలిట ఖర్మ అని విమర్శించారు.
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మోరంపూడిలో జరిగిన 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటిని అర్జీల రూపంలో స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, అక్రమాస్తుల కేసులో సహ నిందితుల్ని నమ్ముకున్న నిన్నెలా జనం నమ్ముతారు జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు.
అవినీతి, డబ్బు, దౌర్జన్యాలు, కబ్జాలు, విధ్వంసాన్ని నమ్ముకున్న జగన్ రెడ్డిని సాగనంపే సమయం ఆసన్నమైందన్నారు. తనకి ఛానెల్స్, పేపర్స్ లేవని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న జగన్ రెడ్డి అక్రమాస్తుల పుత్రిక సాక్షి, దానికి అనుబంధంగా పనిచేస్తున్న బ్లూ మీడియా ఎవరివో చెప్పాలని నిలదీశారు. అన్నివర్గాలకు అన్యాయం చేసి, తన కులం, ప్రాంతం, మతం వారికే పదవులు కట్టబెడుతున్న జగన్ రెడ్డిని గద్దె దింపేందుకు జనం ఎదురుచూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు గారు మళ్లీ వస్తేనే బాగుపడతామని ప్రజలు నినదిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా అధిక ధరలు, పన్నుల భారం తీవ్రంగా ఉందని గ్రామస్తులు లోకేశ్ కి వివరించారు. రోడ్లు, కాలువలు లేక నానా ఇబ్బందులూ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన లేక మూడు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటివరకూ గ్రామస్తులు అందజేసిన సమస్యలన్నీ నమోదు చేసుకున్నామని, టీడీపీ ప్రభుత్వం రాగానే అన్నీ పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.