జగన్ రెడ్డి దిగజారుడుతనానికి ఇప్పుడు ఏర్పాటు చేసిన బీసీ సభే అందుకు నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. బీసీల గొంతుకై నిలుస్తూ తెలుగుదేశం పార్టీ నినదించిన ‘జయహో బీసీ’, ‘బీసీ గర్జన’ వంటి నినాదాలను కూడా కాపీ కొట్టారు కానీ టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను మాత్రం ఆపేశారని యనమల ఆరోపించారు. బీసీలను జగన్ రెడ్డి నిట్టనిలువునా ముంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీలంతా మాకు ‘ఇదేం ఖర్మ’ అని బోరుమంటుంటే.. బీసీలను ఉద్దరించినట్లు సభ పెట్టి, మరోమారు మోసం చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. బీసీలకు అన్నిరకాలుగా అండగా నిలిచింది, ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడేనని యనమల వెల్లడించారు. మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు జగన్ రెడ్డి చేసిందేమీలేదని విమర్శించారు. అంకెల గారడీతో ఏదేదో చేశామని బీసీలను మభ్యపెడుతున్నారని యనమల చెప్పారు. అధికారాలు ఉన్న పదవులేమో సొంత వారికి కట్టబెడుతూ పవర్ లేని పదవుల్లో బీసీలను నియమిస్తున్నారని, సబ్ ప్లాన్ నిధులను కూడా మళ్లించి బీసీలను జగన్ రెడ్డి వంచించారని ఆరోపించారు.