సీమకు చంద్రబాబు మేలు చేయకపోగా.. ముఖ్యమంత్రి జగన్ తలపెట్టిన మంచి పనులనూ అడ్డుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. రాయలసీమకు ఎవరు ఏం చేశారనేది ప్రజలకు బాగా తెలుసని, ప్రజలే చెబుతారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయాడని విమర్శించారు. పోలవరం కనుగొన్నది తానేనన్నట్లు మాట్లాడుతూ చంద్రబాబు పగటి కలల్లో మునిగితేలుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. పోలవరం పనుల్లో జాప్యానికి కారణం చంద్రబాబు నిర్వాకమేనని, ఆయన చెప్పే మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని సజ్జల వివరించారు.
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కుప్పం అభివృద్ధి పనుల్లో వేగం పెరిగిందని సజ్జల చెప్పారు. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారని జగన్ ను కొనియాడారు. జగన్ చేస్తున్న మంచి పనులపై న్యాయస్థానాల్లో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై సజ్జల ఆరోపణలు గుప్పించారు. ఇక మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ఖాయమని సజ్జల తేల్చిచెప్పారు. జగన్ పాలనలో మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తెలిపారు. స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వస్తాయని సజ్జల చెప్పారు.