సినిమాల కోసం నాన్న అప్పులు చేసి కష్టాలు కొని తెచ్చుకొనేవారు అని బాలివుడ్ స్టార్ అమీర్ ఖాన్ వెల్లడించారు. బాలీవుడ్ బడా హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. హిందీ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్లలో ఒకడిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతీసారి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. ఎంతో కష్టపడుతూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చారు. సినీ కుటుంబం నుంచే వచ్చిన ఆయన జీవితంలో సినిమా స్టయిల్ కష్టాలు కూడా ఉన్నాయి.
తన తండ్రి తాహిర్ హుస్సేన్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం తాను చూశానని ఆమిర్ స్వయంగా వెల్లడించారు. నిర్మాత, నటుడు అయినప్పటికీ ఆయన దగ్గర డబ్బు నిలిచేది కాదన్నారు. అప్పులు చేసి కష్టాలు కొని తెచ్చుకొనేవారని, దాంతో, ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు ప్రశాంతత ఉండేది కాదని వెల్లడించారు. అప్పు ఇచ్చిన వారితో ఆయన తరచూ గొడవ పడేవారన్నారు.
తాను ఎదుగుతున్నప్పుడు తన కుటుంబం ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఓపెన్‌గా చెప్పారు. తన తండ్రి తాహిర్ హుస్సేన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడని, ఆయన తీసిన సినిమాలు కూడా దీనివల్ల ప్రభావితం అయి, చివరికి ఫ్లాప్ అయ్యాయని చెప్పారు. తన తండ్రి నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ ఇంట్లో డబ్బు ఉండేది కాదని గుర్తు చేశారు.
‘అప్పట్లో మా నాన్నను చూస్తుంటే మాకు చాలా బాధ కలిగేది. అయన చాలా సాదాసీదా వ్యక్తి. బహుశా అంత అప్పు తీసుకోకూడదని ఆయనకు స్పృహ లేదు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తే మాకు బాధ కలిగేది. ఎందుకంటే అప్పు ఇచ్చేవాళ్లు మా ఇంటికి ఫోన్ చేసేవారు. ఫోన్‌లో మా నాన్న వాళ్లతో గొడవ పడడం మేం వినేవాళ్లం. అప్పు తీర్చమన్న వాళ్లతో నేనేం చేయగలను, నా సినిమా ఆగిపోయింది. కాల్ షీట్స్ ఇవ్వాలని నటీనటులకు చెప్పండి అని ఎదుటివాళ్లతో అనేవారు’ అని ఆమిర్ గుర్తు చేసుకున్నాడు.
ఇదిలావుంటే అమీర్ ఖాన్ చివరగా ‘లాల్ సింగ్ చడ్డా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఆమిర్ ప్రస్తుతం స్పానిష్ చిత్రం ‘ఛాంపియన్స్’కి రీమేక్ అయిన తన తాజా ప్రొడక్షన్ వెంచర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘సలామ్ వెంకీ’లో కూడా ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించారు.