వైఎస్ జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగింది రాష్ట్రాన్ని దోచుకోవటానికేనని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం లోని ఇర్లపాడు గ్రామంలో ‘ఇదే ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ పక్క రాష్ట్రాల ప్రజలు కూడా జగన్ పాలనచూసి నవ్వుకుంటున్నారన్నారు. ఇంటిలో మద్యం తాగే వారు ఒకరుంటే జగన్‌రెడ్డికి జే ట్యాక్స్, స్థానిక మంత్రికి వీఆర్ ట్యాక్స్ కట్టాల్సిందేనన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ వాటిని అమలు చేయలేక రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న ఆయన మాటలు నమ్మి నిరుద్యోగులందరూ ఓట్లు వేస్తే వారిని దగా చేశారన్నారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తేళ్ళ సుబ్బారావు, బండారుపల్లి సత్యనారాయణ, జగదీష్, గుర్రం నాగ పూర్ణయ్య, పీ హనుమంతరావు, ఆర్ నాగేశ్వరరావు, రామాంజీ, సింగయ్య, జయప్రసాదు, పోపూరి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.