స్కిల్ డెవలప్ మెంటు స్కామ్‌లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఆ విషయాన్ని గుర్తించింది. ఇందులో మా ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదన్నారు. నిన్న మార్గదర్శి చిట్‌ఫండ్‌పై రామోజీరావు ప్రకటన ఆశ్చర్యకరంగా ఉందన్నారు. వారు చట్టానికి అతీతులు అన్నట్లు చెప్పుకొచ్చారని తప్పుపట్టారు. స్కిల్ స్కామ్‌లో వారి ప్రమేయం బట్టబయలు కావడంతో, దాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ స్వయంగా బయట పెట్టడంతో, చంద్రబాబు, ఆయన కుమారుడు కిక్కురుమనడం లేదు. లేకపోతే పొలిటికల్ వెండెట్టా అని విమర్శించే వారు. స్కిల్ స్కామ్‌లో ఆధారాలు దొరికాయి. కాబట్టి ఈడీ తన పని తాను చేసుకుపోతుంది. పెద్దల సహకారం, ఆశీస్సులు లేకుండా అంత పెద్ద స్కామ్ సాధ్యం కాదు. కాబట్టే చంద్రబాబు, ఆయన కుమారుడి ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయని సజ్జల అన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాతో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.